సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ‘సమస్య చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తున్నది. పనిభారం పెరుగుతుందని మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒక్క రోజు లీవ్ అడగాలంటే అది ఎవరైన చనిపోయారనే వార్తనే అయ్యిండాలి. డబుల్ డ్యూటీలు చేస్తేనే నెలలో ఒక్కరోజు లీవ్ దొరుకుతుంది. డ్యూటీ దిగేసరికి రాత్రి 11 అవుతుంది. భయభయంగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి మాది.” అంటూ మహిళా కండక్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌నైట్ డ్యూటీలతో వాళ్లంతా పరేషాన్ అవుతున్నారు. ‘గతంలో మార్నింగ్ డ్యూటీ చేసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయేవాళ్లం.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రాత్రి 11 దాటుతోందని మిథాని డిపోకు చెందిన ఓ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్య పెంచలేదు… కానీ ఉచిత బస్సు స్కీం పెట్టారు. ఒక్క బస్సులో 40-50 మంది ఎక్కడమే అధికం. అలాంటిది 150-200 మంది ఎక్కుతున్నారు. వారందరికీ టికెట్ ఇష్యూ చేయడం కత్తిమీద సాములాంటిది. ఈ క్రమంలో టికెట్ ఇష్యూలో తేడా వచ్చిందంటూ సస్పెన్షన్ విధిస్తున్నారు. ఇది మమ్మల్నీ మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్నది.’ అని రాణిగంజ్ డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ అభిప్రాయపడ్డారు.
‘బస్సులో ఏకధాటిగా 9 గంటలు నిలబడుతున్నాం. ఏ కొంత సమయం కూడా కూర్చొనే వీలు లేకుండా పోయింది. ఉచిత బస్సు స్కీంతో బస్సులన్నీ రద్దీగా మారుతున్నాయి. బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉన్న సిబ్బందిపై పనిభారం అధికంగా పడి వారంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంద’ని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో కేసీఆర్ హయాంలో ఎర్లీ డ్యూటీ విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మహిళా కండక్టర్లు రిటైర్ట్ అయిపోతే వారి స్థానంలో కొత్తగా మహిళా కండక్టర్లకే అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా పురుషులను ఆ లిస్టులో చేరుస్తున్నారు.’ అంటూ హయత్‌నగర్ కు చెందిన కండక్టర్ పేర్కొన్నారు.
ఏకధాటిగా నిలబడి ఉండటం వల్ల మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. టాయిలెట్ల సమస్య కూడా వారికి పెద్ద అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల్లో వారు సరిపడా నీళ్లు తీసుకోలేక అనారోగ్యపాలవుతున్నారు. అంతేకాదు మహిళలు డబుల్ డ్యూటీలు చేయాలంటూ.. ఒత్తిడి తీసుకొస్తున్నారు. టార్గెట్లు పెట్టి సతాయిస్తున్నారని మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 3వేల మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. గ్రేటర్లో సుమారు 16 వందల మంది ఉంటారు. సాధారణంగా వీరి విధులు సిటీలో అయితే 7 గంటలు, జిల్లాల్లో అయితే 8 గంటలు ఉండాలి. కానీ ప్రస్తుతం వారి విధులు ముగించుకునే సరికి మరో మూడు గంటలు అదనంగా ఉండాల్సిన దుస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.