సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): చుట్టూ పచ్చని వాతావరణం. ఓవైపు అందంగా పొదిగినట్లుండే మష్రూమ్ రాక్స్, మరోవైపులా వన్యప్రాణులు. వీటి జీవనానికి అవసరమైన మొక్కలు, పొదలు, అంతకు మించి జలవనరులు ఇదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ, జీవవైవిధ్య స్వరూపం. కానీ ఆ భూములపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సహజ వనరులను ప్రశ్నార్థకంగా చేసేలా వ్యవహారిస్తోంది. ఆ 400 ఎకరాలు వర్సిటీ భూములు కాదని చెబుతున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేలా తప్పుడు ప్రకటనలు కూడా చేస్తోంది. ప్రస్తుతం టీజీఐఐసీ వర్గాలు చేపట్టిన పనులకు సమీపంలో కుంటలు, చెరువులు లేవని, జీవరాశులకు ఎలాంటి హాని లేదని వాదిస్తున్నాయి.
కానీ అర్థరాత్రి బుల్డోజర్ల శబ్దానికి ఎన్నో వన్యప్రాణులు ప్రాణాలతో బయటపడేందుకు పరుగులు పెడుతున్నాయి. తమ గూడు చెరిగిపోతోందని జీవరాశుల అర్ధనాదాలు ఓ వైపు. ప్రాజెక్టుకు సమీపంలోనే వేలాది వన్యప్రాణులకు నీటిని అందించే బర్ల కుంట, నెమలికుంట, ఇలా వర్సిటీ సమీపంలో 6 చెరువులు, కుంటలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అవేవి లేవని అబద్ధమాడుతోంది. 100కిపైగా జేసీబీలతో జరుగుతున్న విధ్వంసంతో వన్యప్రాణులు పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు వెస్ట్ సిటీ మొత్తానికి ఆక్సిజన్ అందించే లంగ్ స్పేస్‌ను చెరబట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
వర్సిటీలో అన్ని కుంటలే..
2500 ఎకరాల విస్తీర్ణంలో ఉండే వర్సిటీ భూముల్లో 6కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వాటిలో బర్ల కుంట, నెమలి, లవర్స్ లేక్‌తోపాటు మరికొన్ని ఉన్నాయి. ప్రస్తుతం పనులు చేపట్టిన ప్రాంతానికి సమీపంలోనే బర్లకుంట పశుపక్ష్యాదులన్నింటికీ జలజీవం. అయితే ఇప్పటికే జంతువులు మృత్యువాత పడినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పనులకు సమీపంలోనే బర్లకుంట ఉందని గూగుల్ మ్యాపింగ్లోనూ తెలిసిపోతుంది. కానీ ప్రభుత్వం వితండ వాదనతో తప్పుదోవ పట్టిస్తోంది.
వన్యప్రాణులకు ప్రాణసంకటం
వందలాది జింకలు, నెమళ్లు, కుందేళ్లు, ఇతర వన్యప్రాణులకు ఆవాసమైన ఈ భూముల్లో నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. చిరుజల్లుల మొదలైనప్పుడు, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాంపస్ ప్రాంగణంలో తిరుగుతుంటాయని విద్యార్థులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం టీజీఐఐసీ భూములకు సమీపంలో ఎక్కడా కూడా వన్యప్రాణుల సంచారం లేదని వాదిస్తోంది. ఆదివారం రాత్రి చేపట్టిన లెవలింగ్ పనులతో ఇబ్బందికి గురైన వన్యప్రాణుల హాహాకారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దూసుకువస్తున్న బుల్డోజర్లతో తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ మూగజీవాలు గజగజ వణుకుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆ భూములను లాక్కునేందుకు ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రకటనలు చేసి వన్యప్రాణులను అరిగోస పెడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.