సిటీబ్యూరో: తుక్కు (స్క్రాప్)కు వెళ్లే వాహనాలకు రేడియం స్టిక్కర్ అతికించే ప్రక్రియ ఎందుకని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫిట్నెస్ ప్రక్రియ తొలిగించాలంటూ తాము డిమాండ్ చేస్తున్న తరుణంలో రిఫ్లెక్టివ్ రేడియం టేప్‌లు అతికించడంతో దాదాపు రూ.6వేల అదనపు భారం మోయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆటో 15 ఏండ్లు పూర్తయితే స్క్రాప్‌నకు పంపించాల్సి ఉంటుంది. ఈ దశలో తుక్కు చేయాలంటే అందకు సంబంధించిన ఫిట్నెస్ పొందాల్సి ఉంటుంది. ఫిట్నెస్ కావాలంటే ఇన్సూరెన్స్, పర్మిట్, రేడియం టేప్, పొల్యూషన్ తదితర అన్నీ ఉండాలి.
ఇలా తుక్కు కాబోయే బండికి అనవసరంగా అవన్నీ ఎందుకని? అది వాహనదారులపై భారం మోపడమే అవుతుందని విమర్శలున్నాయి. తుక్కుకు వెళ్లే ఆటోకు నిబంధనలు ఎందుకని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుక్కు ప్రక్రియపై ఆటో యూనియన్ నాయకుడు రామాంజనేయులు స్పందిస్తూ.. రోడ్డుపై రాలేని పరిస్థితుల్లో ఆటోను తుక్కుగా మారుస్తున్నామని.. దానికి ఫిట్నెస్, రేడియం టేప్‌లు కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి తుక్కు ఆటోలకు ఫిట్నెస్, రేడియం స్టిక్కర్ అతికించాలనే నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.