సైదాబాద్‌లో నయీం అనుచరుడినంటూ.. ఓ వ్యక్తి బెదిరింపులు
సిటీబ్యూరో/సైదాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మేయాలంటూ సైదాబాద్‌లోని కరణ్బాగ్లో నివాసముంటున్న మిర్చి వ్యాపారి ప్రకాశ్‌రెడ్డిని నయీమ్ అనుచరుడుగా చెప్పుకునే శ్రీహరి అనే వ్యక్తి రెండేళ్లుగా బెదిరిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రకాశ్‌రెడ్డి భార్య అనురాధ బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తమ ఫ్లాట్ అమ్మాలంటూ శ్రీహరి కుటుంబం ఎన్ని సార్లు బెదిరించినా వినకపోవడంతో ఈనెల 9న శ్రీహరి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రకాశ్‌రెడ్డి ఇంటికి వచ్చి ఆయన కుటుంబంపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు.
తాను నయీం అనుచరుడినని, తనకు హత్యలేం కొత్తకాదని, ఇల్లు తనకు అమ్మకుంటే చంపేస్తానని, అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించినట్లు తెలిపారు. ఒక నెల రోజులు గడువు ఇస్తున్నానని, ఈలోగా ఇల్లు తనకు అమ్మేయాలంటూ బెదిరించి వెళ్లారని, శ్రీహరి, ఆయన కుమారుడితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అనురాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు శ్రీహరి కొడుకు రాజేంద్రప్రసాద్ కూడా ఈనెల 11న సైదాబాద్ పోలీసులకు ప్రకాశ్‌రెడ్డి కుటుంబంపై తమను కులం పేరుతో దూషించారని, దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైదాబాద్ పోలీసులు తెలిపారు.