బడంగ్‌పేట, జనవరి 3 : ఈ ఫొటో చూశారా?! మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ 39వ డివిజన్లోని కమలానగర్లో రెండేళ్ల కిందట ప్రారంభమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇది. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లు.. అధికారుల నిర్లక్ష్యం ఈ నిర్మాణానికి గ్రహణంలా పట్టుకున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరుపేదల కోసం ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, ఎల్ఆర్ఎస్.. ఇలా మూడు పద్దుల కింద రూ.64 లక్షలు సమకూర్చి అందుబాటులో ఉంచినా.. కేవలం అధికారుల నిర్లక్ష్యం, వారిలో లోపించిన చిత్తశుద్ధి కారణంగా రెండు సంవత్సరాలుగా ఆ డివిజన్ ప్రజలను ఈ అసంపూర్తి నిర్మాణం వెక్కిరిస్తూనే ఉంది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు చిన్నపాటి వేడుకలను చిన్న ఇంట్లో చేసుకోలేక.. లక్షల రూపాయలు వెచ్చించి ఫంక్షన్ హాల్స్ బుక్ చేయలేక.. ప్రభుత్వపరంగా ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రాక.. సతమతం అవుతున్నారు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలానగర్ 39వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 2021, అక్టోబర్ 26న అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.30 లక్షలు కేటాయించారు. ఆ నిధులు సరిపోవని అధికారులు చెబితే.. జనరల్ ఫండ్, ఎల్ఆర్ఎస్ కింద మరో రూ.34 లక్షలను కూడా మంజూరు చేయించారు. అయినా అధికారులకు నిరుపేదల పట్ల కనికరం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని నిధులు వెనక్కిపోయాయి. పైగా గతంలో అనేకసార్లు సబితా ఇంద్రారెడ్డి పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం చలనం రాలేదు.
అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోవద్దనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ మాదారి సురేఖ రమేశ్ పలుమార్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో మరో రూ.10 లక్షల జనరల్ ఫండ్ నిధులు కేటాయించినా పనులు మాత్రం ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. దీంతో రూ.24లక్షల ఎల్ఆర్ఎస్ నిధులు, జనరల్ నిధుల నుంచి రూ.10 లక్షలు నిధులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రమాదముందని కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలైనా నిర్మాణం పూర్తి కాకపోవడంపై డీఈని సంప్రదించగా.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారే తప్ప ఫలితం ఉండటం లేదన్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకపోగా… అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం ఇంజినీరింగ్ అధికారులు అందుబాటులో లేరని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వాణి తెలిపారు.