సికింద్రాబాద్, జనవరి 30: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో కొంతమంది విపక్ష పార్టీల నేతలు తమ చలువే అంటూ భుజాలు తడుముకోవడంపై ఆయన మండిపడ్డారు. ఆదివారం బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న మాట్లాడారు. కేంద్రంలో అడుక్కుని వచ్చి పదవిలో కూర్చుని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. జనాల మద్దతుతో తాము గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నామని, రాష్ట్ర సర్కారు దీవెనలతో కంటోన్మెంట్ వాసులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఉచిత తాగునీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఆది నుంచి సుముఖతతోనే ఉందని, అడ్డంకులను అధిగమిస్తూ వచ్చిందని, ఈ క్రమంలోనే త్వరలోనే ఉచిత తాగునీరు సరఫరా కానున్నదన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌పై దృష్టి సారించిందని, త్వరలోనే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర సర్కారు ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం కంటోన్మెంట్లో సైతం అమలు అవుతున్నాయని స్పష్టం చేశారు. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకమైనా కంటోన్మెంట్లో అమలుకు నోచుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. ఆర్మీ నుంచి రావాల్సిన బకాయిలు రప్పించడంలో విఫలమవుతున్న నేతలు కూ డా నేడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఆర్మీ నుంచి వచ్చే సర్వీస్ చార్జీల్లో కనీసం పది శాతం బకాయిలను విడుదల చేయించే దమ్ము లేని దద్దమ్మలు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపైన నోరు పారేసుకునే నేతలు ఆర్మీ బకాయిలపై మాట్లాడరెందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, నళినికిరణ్, శ్యామ్‌కుమార్, నేతలు నివేదితా, ముప్పిడి మధుకర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.