సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో అదృష్టం బాగుంటే ఏం కాకపోవచ్చు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో.. ఆ వాహనానికి బీమా చేయించడం కూడా అంతే ముఖ్యం. ప్రమాద సమయంలో ఇటు వాహనానికి అటు వ్యక్తికి కొంత ధైర్యాన్నిచ్చేది బీమా.
అయితే గ్రేటర్లో వాహనదారులు తమ బండ్లకు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించడం లేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసే సమయంలో మినహా.. ఆ తర్వాత బీమా రెన్యువల్‌కు ఆసక్తి చూపడం లేదు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తున్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ను భారంగా భావించకుండా రెన్యువల్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్లో వాహనాల ఇన్సూరెన్స్ రెన్యువల్‌పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.
వాహనాల రిజిస్టేష్రన్లలో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తుంది. హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మూసారంబాగ్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా… గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డిలో కొండాపూర్, అత్తాపూర్ కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉప్పల్, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 40.66 లక్షల అన్ని రకాల వాహనాలు ఉండగా… రంగారెడ్డి పరిధిలో 20.39 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 21.40 లక్షల వరకు ఉన్నట్లుగా రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి.
దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 82,45,304 వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 58,71539 వాహనాలు ఉండగా కార్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. కాగా, రెన్యూవల్ కానీ వాహనాలు అధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. గ్రేటర్లో మొత్తం 82,45,304 వాహనాలు ఉండగా ఇందులో 47 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే నడుస్తున్నట్టు అధికారులు లెక్కలు తీశారు. అంటే సుమారు 38,75292 వాహనాలు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించకుండానే నిర్లక్ష్యంగా రాకపోకలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.