సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ ): వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. కొందరు తమ వాహనాల ఇన్సూరెన్స్ గడువు ముగిసినా రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇప్పటి వరకు 140 వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. హైదరాబాద్‌లోనే అధికంగా ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసే సమయంలో మినహ.. ఆ తర్వాత బీమా రెన్యువల్‌కు వాహనదారులు ఆసక్తి చూపించడం లేదని అధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ను భారంగా భావించకుండా రెన్యువల్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మూసారాంబాగ్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా.. గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డిలో కొండాపూర్, అత్తాపూర్ కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉప్పల్, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 44.66 లక్షల అన్ని రకాల వాహనాలు ఉండగా.. రంగారెడ్డి పరిధిలో 22.39 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 21.40 లక్షల వరకు ఉన్నట్లుగా రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 88లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 58,71,539 లక్షల వాహనాలు ఉండగా కార్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
కాగా, రెన్యువల్ కాని వాహనాలు అధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. గ్రేటర్లో మొత్తం 88లక్షలకుపైగా వాహనాలు ఉండగా ఇందులో 47 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే నడుస్తున్నట్టు అధికారులు లెక్కలు తీశారు. అంటే సుమారు 38 లక్షలకు పైగా వాహనాలు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించకుండానే రాకపోకలు సాగిస్తున్నట్టు తెలిసింది. అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.