సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 50శాతం రెట్టింపు రాబడి చెల్లిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి వద్ద నుంచి సుమారు రూ.50కోట్లకు పైగా వసూ లు చేసి, బిచాణా ఎత్తేసిన ఏవీ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఈఓడబ్ల్యూ ఠాణా కు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న మరికొందరు బాధితులు ఈవోడబ్ల్యూ ఠాణాకు చేరుకుని ఏవీ ఇన్ఫ్రాపై ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే…నగరానికి చెందిన విజయ్ గోగుల మరో 10మందితో కలిసి ఆరేళ్ళ క్రితం ఏవీ ఇన్ఫ్రా పేరుతో మా దాపూర్లో ఒక సంస్థను ప్రారంభించాడు. ఫ్రీ లాంచింగ్, అధిక రాబడి, తదితర ఆశలు చూపి పెద్ద ఎత్తున జనాలను ఆకర్శించాడు. ఈ క్రమంలో తమ సంస్థ పెద్ద ఎత్తున వెంచర్లు చేస్తోందని, యాదగిరిగుట్ట, నారాయణఖేడ్, బుదేరా, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లపై పెట్టుబడులు పెడితే, పెట్టిన పెట్టుబడిపై ఏడాది కాలంలోనే 50శాతం రాబడి చెల్లిస్తామని నమ్మబలికారు. దీంతో దాదాపు 200మందికి పైగా బాధితులు లక్షలు, కోట్లలో పెట్టుబడులు పెట్టారు.
ప్రారంభంలో కొంతమందికి రాబడి చెల్లించడంతో అది చూసిన మరికొంత మంది ఆకర్శితులై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు వసూలు చేసిన విజయ్ గోగుల ముఠా గత సంవత్సరం బిచాణ ఎత్తేసింది. దీంతో గత సంవత్సరం నవంబర్‌లో శ్వేత, రఘు అనే బాధితులు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండడమే కాకుండా కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తేలింది. దీంతో కేసును ఈఓడబ్య్లూ ఠాణాకు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న మరికొంత మంది బాధితులు శుక్రవారం పెద్ద ఎత్తున ఈఓడబ్ల్యూ ఠాణాకు చేరుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.