నీటిని వృథా చేయొద్దు
ఇంకుడు గుంతలపై డెప్యూటా మేయర్ అవగాహన
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జలమే జనం, జలమే దానం, జలమే బలం, సుజలం, సుఫలం అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నీటిని కాపాడుకోవడం మన రోజువారీ పనులకు ఎంతో ఉపయోగకరమన్నారు. వర్షపు నీరు ఎలా వాడుకోవాలో పలు సూచనలు చేశారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, జలమండలి అధికారులు నిఖిత, పాపారావు, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట
డిప్యూటీ మేయర్ తార్నాకలోని చాయ్బండి వద్ద చాయ్ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తార్నాకలోని తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లే క్రమంలో దారి మధ్యలోని చింతల్ బస్తీ మీదుగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా కారు ఆపి, లాలాపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న చాయ్ బండి వద్ద చాయ్ తాగుతూ స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పరుశురాం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.