సిటీబ్యూరో, మార్చ్ 23(నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో ఇటీవల విడుదలవుతున్న అధికారిక ఉత్తర్వులు గందరగోళం సృష్టిస్తున్నాయి. గత నెలలో సీఎండీ ముషారఫ్ బదిలీ తర్వాత సీఎండీగా బాధ్యతలు చేపట్టిన జితేశ్ వీ పాటిల్ ఇప్పటివరకు కేవలం డిప్యుటేషన్ ఉత్తర్వులే ఇవ్వగా సరఫరా, బదిలీలు, స్టోర్స్, క్షేత్రస్థాయి పనులు తదితర అంశాలపై కంపెనీ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈనెల 20వ తేదీన మెట్రో జోన్ సీఈ వేముల ప్రభాకర్ పేరుతో ఒక ఉత్తర్వు ఆ పరిధిలోని అన్ని స్టేషన్లకు జారీ అయింది.
అందులో పేర్కొన్న అంశాలు కొంత వివాదాస్పదం కావడంతోపాటు మొత్తం డిస్కంలోనే ఓసీ(ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల)లింక్ తొలగిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో సీఎండీ సీరియస్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఉత్తర్వుల్లో గత నెల 25న అంటే ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు జరిగిన రోజే తనకు అందిన మౌఖిక ఆదేశాల మేరకు కొత్త సర్వీస్ కనెక్షన్లను విడుదల చేసే సమయంలో, ఇప్పటికే ఉన్న సర్వీసులకు అదనపు లోడ్ విషయంలో సవరించిన సూచనలతో ఉత్తర్వులు ఇచ్చారు. అందులో ఎల్టీ టు హెచ్టీ మరియు వీటికి విరుద్దంగా సర్వీస్ మార్పిడి విషయంలో ఓసీ కోసం అడగాల్సిన అవసరం లేదని, భవనాలకు కనెక్షన్లు ఇచ్చే సందర్భంలో ఓసీలు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను సవరిస్తూ అందుకోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులు మొత్తం డిస్కంలోనే దుమారం రేపాయి. ముఖ్యంగా గత సంవత్సరం కాలంగా డిస్కంలో కొత్త కనెక్షన్లన్నీ ఓసీల నేపథ్యంలో చాలావరకు నిలిచిన నేపథ్యంలో మెట్రో జోన్ సీఈ ఇచ్చిన ఉత్తర్వులు కొంత ఉపశమనం ఇచ్చాయని వినియోగదారులు భావించారు. అయితే ఇది కేవలం మెట్రోజోన్ పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుండడంతో మిగతావాటి విషయంలో డిస్కం నిర్ణయం ఏంటనేది తేలలేదు. ఈ ఉత్తర్వులపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మెట్రో సీఈపై సీఎండీ సీరియస్ అయినట్లు సమాచారం.
వ్యక్తిగతంగా ఒక్కజోన్కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడమేంటని, అందులోనూ పాత సీఎండీ ఇచ్చిన మౌఖిక ఆదేశాలు అని పేర్కొనడం వెనక ఏం ఉద్దేశ్యం ఉందని ప్రశ్నించడంతో 20వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. కార్పొరేట్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వస్తాయని మరో జీవో 23న విడుదల చేశారు. అయితే వీటి వెనుక ఎవరి పాత్ర ఉందని డిస్కంలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు పొంతన లేకుండా కేవలం పాత సీఎండీ ఒత్తిడి మేరకు వరుసగా వస్తున్న జీవోలా? అంటూ ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. జీవో ఇచ్చి వెంటనే రద్దు చేసి కార్పొరేట్ ఆఫీసు నుంచే మళ్లీ ఉత్తర్వులు వస్తాయంటూ మెట్రోజోన్ సీఈ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం డిస్కంలో పెద్ద చర్చకు దారితీశాయి.