అమీర్‌పేట, మే 27 : ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిధిలో కొనసాగుతున్న ట్రేడర్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి జితెన్ రామ్ మాంజీ తెలిపారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎస్ఎంఈ లో ట్రేడర్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చాంబర్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఎమ్ఎస్ఎంఈల తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సిడీతో కూడిన బ్యాంక్ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని, అదేవిధంగా జీఎస్టీ స్లాబుల విషయంలో కూడా 5 శాతం వెసులుబాటు కల్పించేలా తగిన చొరవ తీసుకోవాలని చాంబర్ అధ్యక్షుడు ప్రకాశ్, ప్రతినిధులు సతీశ్‌లు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ప్రభావం వల్ల మీడియం, స్మాల్ ట్రేడర్స్ ఎదుర్కొంటున్న నష్టాల సమస్యలను పరిష్కరించేందుకు, వారికోసం మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు. చాంబర్ సమావేశంలో తాము కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాల పట్ల సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు.