కొండాపూర్, జనవరి 28 : పద్మ అవార్డుల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు.. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల అన్నారు. మంగళవారం మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గద్దర్ వ్యక్తి కాదు.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.. తెలంగాణ ప్రజల ఆశ అని అన్నారు. తెలంగాణ సమజాన్ని కించపరిచేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యాలపై రెండు రాష్ర్టాల ప్రజలు స్పందించాలన్నారు. బీజేపీ నాయకుల ఇంట్లో నుంచి అవార్డులను ఇస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గద్దర్‌కు ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనని, పద్మ అవార్డులు లభిస్తే గౌరవంగా భావిస్తామన్నారు. గద్దర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీని భూస్థాపితం చేస్తాం..
బడంగ్‌పేట: గద్దరన్న పై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలను భేషరత్‌గా వెనక్కి తీసుకోక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గద్దర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్ యాదగిరి, నల్లమల్ల మురళీ, జక్క గోపాల్, చందర్, మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్, బీఎస్సీ రాష్ట్ర కోర్డినేటర్ ఇబ్రాం శేఖర్ వేర్వేరు ప్రకనటలో డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను సైతం గద్దర్ తిరస్కరించిన చరిత్ర నీకు తెలియదన్నారు. గద్దర్ బతికి ఉన్న సమయంలో నీవు ఇలాంటి మాటలు మాట్లాడితే నీవు ఎక్కడ ఉండే వాడివో తెలిసిపోయేదన్నారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోక పోతే బీజేపీ భూస్థాపితం చేస్తామన్నారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
హిమాయత్‌నగర్: గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏఐ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలి ఉల్లాఖాద్రీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తన ఆట,పాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ ప్రపంచ ఖ్యాతి పొందిన గద్దర్‌పై అర్థరహితంగా బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.