సికింద్రాబాద్ : ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ యువతి ప్రతిఘటించడంతో ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
డెయిరీ ఫారం రోడ్డులోని సత్యసాయి ఎన్‌క్లేవ్‌కు చెందిన మనోజ్ సాలేచా జైన్ జీడిమెట్లలో రసాయన పరిశ్రమ నిర్వహిస్తు న్నాడు. రోజులాగే ఈ నెల 10న మనోజ్ అతని కుమారుడు మోక్షిత్లు వ్యాపార నిమిత్తం వెళ్లగా అతని భార్య ప్రేమలత పని మీద పక్కింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనోజ్ కుమార్తె రున్సిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆక్టివా పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు ఇంట్లోకి బలవంతంగా చొరబడి మనోజ్ అతని భార్య కోసం ఆరా తీయగా వారు ఇంట్లో లేరని రున్సిక చెప్పింది. దీంతో అగంతకులు రున్సిక చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కోవడంతో పాటు ఆమె నోరు మూసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో రున్సిక ఇరువురిని నెట్టేసి కేకలు వేసుకుంటూ పక్కింట్లో ఉన్న తన తల్లిని పిలిచింది. ఇది గమనించిన ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా గతంలో ఫోన్లు చేసిన గుర్తు తెలియని అగంతకులు తమకు కోటి రూపాయాలు ఇవ్వాలని, లేని పక్షంలో మనోజ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను కాల్చి చంపుతామని బెదిరించినట్లు తెలిపారు.
బాధితుల పిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.