జూబ్లీహిల్స్: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణ క్రీడలైన కట్టెసాము.. కర్రసాము.. కత్తిసాములలో శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నది. వేసవి శిబిరాలలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యూసఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 45 రోజుల ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు.
అంతరించిపోతున్న సాంప్రదాయ యుద్ద క్రీడలలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున యువతీ యువకులకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలలో మే 1 వ తేదీనుంచి నిర్వహించనున్న ఈ శిబిరాలకు సంబంధించిన పోస్టర్‌ను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గురువారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీధర్, స్వర్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.