బేగంపేట్ జూన్ 24: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం నేటి నుంచి ప్రారంభం కానున్నదని ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు దేవాలయం నుంచి పసుపు కుంకుమలతో అమ్మవారి విగ్రహాన్ని కర్బలా మైదాన్ వద్దకు తీసుకు వెళ్లి అక్కడ ఘటం తయారు చేస్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు కర్బలామైదాన్ నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని దేవాలయానికి తీసుకువస్తారని పేర్కొన్నారు. దేవాలయంలో ఇప్పటికే ఏర్పాట్ల పనులు ప్రారంభమైనట్టు వివరించారు. జాతరకు వచ్చే భక్తులందరికీ అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఘటోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దేవాలయం ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభిస్తారని ఈవో తెలిపారు.
మెహిదీపట్నం జూన్ 24: చారిత్రాత్మక గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఆషాఢ మాసం రెండో బోనం నిర్వహించనున్నారు. శనివారం ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్ సభ్యులతో కలిసి జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయాన్ని అలంకరించడం పూర్తయిందని ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు తెలిపారు.