Hyderabad | హైదరాబాద్ : నగర ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌లో ఉండాల్సిన ఓ ఇద్దరు పోలీసులు.. తమకేమి పట్టనట్టు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున బండ్లగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ షాహబాజ్, హోంగార్డు ఇమ్రాన్‌కు బుధవారం రాత్రి పెట్రోలింగ్ విధులు అప్పజెప్పారు. వీరిద్దరూ పెట్రోలింగ్ కారులో బండ్లగూడలోని కింగ్స్ ఎవెన్యూ కాలనీలోని ఓ గుట్కా వ్యాపారి ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ పెట్రోలింగ్ కారును నిలిపేసి.. అక్కడే ఉన్న ఓ గదిలో గాఢ నిద్రలోకి జారుకున్నారు.
అయితే రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించే పోలీసుల పనితీరుపై నిఘా ఉంచేందుకు పోలీసు ఉన్నతాధికారులు షాడో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ షాడో బృందాలు.. కింగ్స్ ఎవెన్యూ కాలనీలోకి ప్రవేశించగా.. పెట్రోలింగ్‌లో ఉండాల్సిన పోలీసులు గాఢ నిద్రలో ఉన్న దృశ్యం కంటబడింది. దీంతో షాడో బృందం తమ ట్యాబ్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు ప్రతి రోజు ఇలానే నిద్ర పోతున్నట్లు స్థానికులు తెలిపారు.