కీసర, ఫిబ్రవరి 5: కీసర ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కీసర పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా మోత్కూరు ప్రాంతం ఒకే కుటుంబానికి చెందిన మహ్మద్ జహంగీర్ (45), సుల్తానా, నజీర్, నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన షేక్ పీర్ సాహెబ్, మహబూబాబాద్ జిల్లా నాంచార్ మండలానికి చెందిన రాపోలు శ్రీనివాస్, రాపోలు సంపత్ (12), రాపోలు రవి సురారంలోని జియో కేబుల్ దగ్గర పనిచేస్తారు. పీర్ సాహెబ్ ఆ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడికి స్విఫ్ట్ కారు ఉంది.
ఘట్కేసర్లో ఉంటున్న వీరందరిని ప్రతిరోజు పీర్‌సాహెబ్ తన కారులో సూరారంలో జరుగుతున్న పనుల వద్దకు తీసుకువెళ్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా వీరు కారులో ఘట్కేసర్ నుంచి బయలుదేరి సూరారం వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. కీసర సమీపంలో వీరికి ఎదురుగా (అపోజిట్ డైరెక్షన్) వేగంగా దూసుకొచ్చిన బెంజి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదేవేగంతో దూసుకొచ్చి.. కూలీలు వెళ్తున్న స్విఫ్ట్ కారును కూడా ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారులో ఉన్న రాపోలు సంపత్, జహంగీర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బెంజి కారులో కూడా ఇద్దరు ఉన్నారు. వారిద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చారు. గాయాలకు గురైన వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. ఈ కేసును కీసర పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.