Star Tortoises | సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా నక్షత్ర తాబేళ్లు, రెడ్ ఇయర్డ్ ైస్లెడ్ తాబేళ్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…పీర్జాదిగూడ, ఆదర్శ్‌నగర్‌కు చెందిన షేక్ జానీ స్థానికంగా ‘ఫేమస్ అక్వేరియం’ పేరుతో రకరకాల చేపలు, పక్షులను విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాబేళ్లను కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఫేమస్ అక్వేరియం దుకాణంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 5 నిషేధిత నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ ఎఫ్ఆర్వో అధికారికి సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన ఎఫ్ఆర్వో.. తాబేళ్లను మార్కెట్లో విక్రయించడం చట్ట విరుద్ధమని ధ్రువీకరించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ‘న్యూ షైన్ అక్వేరియం’ నిర్వాహకుడైన సిరాజ్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఈ తాబేళ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు, ఎఫ్ఆర్వో బృందంతో కలిసి మలక్‌పేటలోని సిరాజ్ దుకాణంపై దాడులు జరిపి.. అతడి రహస్య గోదాంలో ఉన్న 281 నక్షత్ర తాబేళ్లు, 160 రెడ్ ఇయర్డ్ ైస్లెడర్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ 1972 చట్టం ప్రకారం నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 64 లక్షల విలువ చేసే 441 తాబేళ్లను స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏపీకి చెందిన విజయ్‌కుమార్ అనే వ్యక్తి సొంత రాష్ట్రం నుంచి ఈ తాబేళ్లను నగరానికి స్మగ్లింగ్ చేసి సిరాజ్‌కు విక్రయిస్తున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు విజయ్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తదుపరి విచారణ కోసం కేసును హైదరాబాద్ ఈస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అరుణకు అప్పగించారు.