ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 24 : ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గోదావరిఖనికి చెందిన అతికెటి సిద్ధార్థ ఓయూ ఇంజినీరింగ్ కళాశాల మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ద్వితీయ సంవత్సరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం కు చెందిన బంటు రాజుకుమార్ ప్రథమ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.
వారిద్దరూ ఓయూలోని హాస్టల్ లో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి బైక్ పై విద్యానగర్ వైపు వెళ్తుండగా.. ఫుట్ పాత్ తాకి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.