కొండాపూర్, సెప్టెంబర్ 30 : గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గమనించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖపట్నానికి చెందిన మెరిపాటి మనోజ్‌కుమార్ (22), విజయనగరం జిల్లాకు చెందిన ఎం ఆశాజ్యోతి (23)లుగా గుర్తించారు. విచారణలో ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.