TUJAC | కవాడిగూడ, మార్చి 2: గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కవాడిగూడ బీమా మైదాన్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం టీయూజేఏసీ కమిటీ సమావేశం జరిగింది. జేఏసీ నాయకులు చంద్రన్న ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీయూజేఏసీ చైర్మన్ యాదగిరి, సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, క్రిస్టఫర్లు పాల్గొని గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను విజయవంతం చేయాలని రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 30 వేల గౌరవ భృతి ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వెంటనే తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల విషమ బోర్డును ఏర్పాటు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉద్యమకారులను విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఉద్యమకారులంతా ఏకమై మిలియన్ మార్చ్ డే ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మాధవి, జేఏసీ నాయకులు యాదగిరి, మోహన్ బైరాగి, చందర్, వెంకటలక్ష్మి, అంజలి కుమారి, స్వరూపరాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.