Metro Deluxe | సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కొత్తగా వచ్చిన మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని, టికెట్ ధర చెల్లించాల్సిందేనని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నూతనంగా 24 మెట్రో డీలక్స్ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. అయితే ఈ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ ఎందుకు తీసుకోవాలంటూ కండక్టర్లతో ఘర్షణ పడుతున్నారు. కేవలం ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతిచ్చి.. మెట్రో బస్సుల్లో నిరాకరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో డీలక్స్ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో 110 కొత్త మెట్రో బస్సులు రాబోతున్నట్టు వెల్లడించారు.
టీ హబ్‌లో మ్యాథ్ హ్యాక్
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కొత్తగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ, మేషిన్ లర్నింగ్‌లో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సోమవారం టీ హబ్‌లో మ్యాథ్ హ్యాక్ ప్రారంభమైంది. 36 గంటల పాటు కొనసాగే ఈ మ్యాథ్హ్యాక్లో ఆవిష్కరణలు చేయాలన్న ఔత్సాహికులైన విద్యార్థులు, స్టార్టప్స్, డెవలపర్స్‌తో కార్యక్రమాన్ని టీ హబ్ సీఈవో ఎం.ఎస్.రావు ప్రారంభించారు.