సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. చిల్లర కోసం ఇబ్బంది పడకుండా డిజిటల్ చెల్లింపులు చేపట్టబోతుంది. అందుకు, ప్రయోగాత్మకంగా టిక్కెట్ జారీ కోసం యూపీఐ లేదా క్యూర్ ద్వారా చెల్లింపులను స్వీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద మంగళవారం నుంచి ఎంజీబీఎస్‌లో టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్ బుకింగ్, కార్గో సర్వీసులకు అమలు పరుస్తుంది. అలాగే, సికింద్రాబాద్‌లోని రెతిఫైల్ బస్‌పాస్ కేంద్రంలో కూడా యూపీఐ, క్యూఆర్ కోడ్‌ను ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు పరుచనున్నట్లు మంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులు అధికారికమంగా తెలిపారు. అయితే, దీనిపై అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. ఏమైనా సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు.