
సుల్తాన్‌బజార్, అక్టోబర్ 5: దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ సమాయత్తమవుతున్నది. ఇతర రాష్ర్టాలకూ పండుగ స్పెషల్ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మరీముఖ్యంగా జంటనగరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ల ద్వారా ఈ బస్సులను నడిపేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం 4035 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ వి.వరప్రసాద్ తెలిపారు.
మంగళవారం ఎంజీబీఎస్‌లోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ బస్సుల వివరాలు వెల్లడించారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ నెల 11 నుంచి అధికంగా బస్సులను నడిపిస్తామన్నారు. అన్ని పాయింట్ల వద్ద ఆర్ఎం స్థాయి నుంచి డీవీఎం, డిపో మేనేజర్లు అందుబాటులో ఉండి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారని వివరించారు.