కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 4 : కేపీహెచ్‌బీ కాలనీలో రూ. 10 కోట్ల విలువైన సీఎంసీ పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తుంటే…నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కూకట్పల్లి మండలం హైదర్‌నగర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 152లో 18.5 ఎకరాల విస్తీర్ణంలో శిల్పా ఎవేన్యూ కాలనీ ఏర్పాటైంది. లేఆవుట్ ప్రకారం 10 శాతం విస్తీర్ణంలో పార్కులు ఉండగా, కాలనీలోని పార్కులన్నీ సీఎంసీ (గతంలో జీహెచ్ఎంసీ) ఆధీనంలో ఉన్నాయి. ఈ పార్కులలో ఒకటైన నందనవనం పార్కు చుట్టూ గోడను నిర్మించి దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్కులో వాకింగ్ ట్రాక్, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించగా, ఆ పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు కొందరు వ్యక్తు లు పార్కు స్థలంలోకి చొరబడి 800 గజాల స్థలం తమదంటూ… రేకులతో ఫెన్సింగ్ వేసే పనులను చేపట్టగా ఇది గమనించిన స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు అడ్డుకుని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరునాడే కబ్జాదారులు జేసీబీతో వచ్చి పార్కు గోడను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ పార్కు స్థలం కాదు… మా దంటూ, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయని హెచ్చరికలు చేశారు. దీంతో వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, స్థానికులు అక్కడి నుం చి వెళ్లిపోయి మరోసారి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి పార్కు స్థలాన్ని కాపాడాలని వేడుకున్నారు. తమ కాలనీకి చెందిన లేఆవుట్ కాఫీల ను అందించి, పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో కబ్జాకు యత్నం..అడ్డుకున్న ఎమ్మెల్యే..
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని శిల్పా ఎవెన్యూ కాలనీలోని నందనవనం పార్కులో గతంలో కొందరు వ్యక్తులు చోరబడి 400 గజాల స్థలాన్ని అక్రమించేందుకు యత్నించిగా… స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావులు అడ్డుకున్నారు. కజ్జాకు యత్ని ంచిన వారిపై కేసులు నమోదు చేయించి, ఖాళీగా ఉన్న పార్కు స్థలాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇన్నాళ్లకు మరికొందరు వ్యక్తులు వచ్చి దౌర్జనంగా పార్కు స్థలంలోకి చొరబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు యత్నించడం, చివరకు పార్కు గోడనే కూల్చివేయడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి పార్కు స్థలంలో అక్రమంగా చొరబడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోలని స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. ‘శిల్పా ఎవెన్యూ కాలనీలోని నందనవనం పార్కు గోడను కూల్చివేసినట్లు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. పార్కు గోడను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. గతంలో పార్కులో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రస్తుతం యూబీడీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’ అని బల్దియా ఏఈ రాజీవ్ తెలిపారు.