ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 22 : రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా దోస్త్ ద్వారా డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టిన సెక్టార్ స్కిల్ కోర్సుల అమలులో భాగంగా త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. బీబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి, హెల్త్ కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (హెచ్ఎస్ఎస్సీ), కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, తెలంగాణ యూనివర్సిటీల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందంపై సంతకాలు నిర్వహించిన అనంతరం ఈ కోర్సుపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కోర్సులో భాగంగా విద్యార్థులకు వేతనంతో కూడిన శిక్షణ అందించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ఎస్సీ చీఫ్ సుబ్బారావు, సీఈవో ఆశిష్ జైన్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఝాన్సీ, అధికారులు అనాహు వర్మ, పూజ, ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ రాజేంద్రసింగ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ డీటీ చారి, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, కోర్సు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.