Crime News | బండ్లగూడ, మార్చి 7: యువతి పేరుతో ట్రాప్‌చేసి.. ఓ యువకుడిని హత్య చేసిన ఐదుగురు నిందితులను గుర్తించిన అత్తాపూర్ పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. బాలాపూర్‌కు చెందిన ఫహీం (23) పెయింటర్. గతనెలలో నిర్వహించిన జగ్నేకి రాత్లో యాసీన్ అనే యువకుడితో ఫహీంకు గొడవ జరిగింది. ఒకరినొకరు చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై పెద్దలు రాజీ కుదిర్చినా.. వారిలో కోపాలు మాత్రం తగ్గలేదు. ఫాహింను ఎలాగైనా చంపాలని యాసీన్ నిర్ణయించుకొని, అతడి స్నేహితులైన ఖురేషి, మహ్మద్ అబ్దుల్ మిన్హజ్, ఖయ్యూం, మహ్మద్ ఫహీంతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామంలో ఒక యువతి ఫొటోతో ఫేక్ అకౌంట్‌ను తెరిచారు.
ఆ అకౌంట్ ద్వారా ఫహీంతో రోజు యువతి మాదిరిగా చాటింగ్ చేశారు. కుట్రలో భాగంగా.. ఈ నెల ఐదో తేదీన సులేమాన్ నగర్‌లోని ఎంఎం పహాడ్ భార ఇమామ్ వద్దకు రావాలంటూ యువతి మాదిరిగా మెసేజ్ పెట్టి, ఫహీంను పిలిచారు. యువతి పిలుస్తున్నట్టుగా భావించిన ఫహీం అక్కడికి చేరుకోగానే.. యాసిన్ తన స్నేహితులతో కలిసి దాడిచేసి, హత్య చేశాడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. పిస్తా హౌజ్ హోటల్‌పై దాడి కేసులో.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌజ్‌పై ఈ నెల 3వ తేదీన జరిగిన దాడి కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.