ఎల్బీనగర్, మార్చి 8 : సమాజంలో ప్రజల పట్ల ట్రాన్స్‌జెండర్స్ గౌరవంగా జీవించాలని సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూదన్ సూచించారు. బుధవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్‌జెండర్స్‌తో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరూర్‌నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లలో, రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలను నిలువరించి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం తగదని హెచ్చరించారు. ఫంక్షన్ హాల్స్, శుభ కార్యాల వద్ద నిర్వాహకులతో పరుష పదజాలంతో మాట్లాడడం, అగౌరవపరిచేలా ప్రవర్తించడం, రాత్రిపూట రోడ్లపై వచ్చిపోయే వాహనదారులను, కాలనీల్లోకి వెళ్లే వారిని ఇబ్బందులకు గురిచేయడం, వారాంతపు సంతల వద్ద చిన్న తరగతి వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద, దేవాలయాల వద్దకు వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలిపారు. స్వతహాగా ఎవరైనా తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తే తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పోలీసుశాఖ తరుఫున న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో సరూర్‌నగర్, చైతన్యపురి పోలీసు స్టేషన్ల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.