కూకట్‌పల్లిలో 9 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్..
ఐదు ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్
త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు
కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 11: నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. రోడ్లపై సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల నడుచుకుంటే వెళ్లే పాదచారులతో పాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రధాన చౌరస్తాలలో సిగ్నల్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడిన రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు లేకపోవడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్, అవసరమైన చోట పెలికాన్స్ సిగ్నల్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో 250 జంక్షన్లను రూ.60 కోట్లతో అభివృద్ధి చేయడానికి సంకల్పించగా దీనిలో భాగంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ,పెలికాన్స్ సిగ్నల్స్అందుబాటులోకి రానున్నాయి.
9 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్…
కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 9 చోట్ల కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ మసీదు చౌరస్తా, ప్రశాంత్‌నగర్ టీ జంక్షన్, తులసీనగర్ శ్రీనివాస ఎక్స్ రోడ్డు, కొలను రాఘవరెడ్డి గార్డెన్, ఆంజనేయనగర్ చౌరస్తా, కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్ గోకుల్ చౌరస్తా, కేపీహెచ్‌బీ కాలనీ బ్రాండ్ ఫ్యాక్టరీ చౌరస్తా, కైత్లాపూర్ రెయింబో విస్తాస్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్, ప్రశాంత్‌నగర్ టీ జంక్షన్లలో సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి రాగా త్వరలోనే మిగిలిన ప్రాంతాలలో సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
రోడ్డును దాటేలా… పెలికాన్స్ సిగ్నల్స్..
రోడ్డును దాటే క్రమంలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో… రోడ్డును సులభంగా దాటేలా పెలికాన్స్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ప్రాంతాల్లో పెలికాన్స్ సిగ్నల్స్‌కు ఆమోదం లభించింది.
ఈ పెలికాన్స్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో పాదచారులు సులభంగా రోడ్డును దాటేలా సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ముంబై జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించే దిశగా కేపీహెచ్‌బీ కాలనీ హైదర్‌నగర్ రెయింబో వైద్యశాల, కూకట్పల్లి ఏసీపీ కార్యాలయం ఎదుట కొత్తగా పెలికాన్స్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.వీటితో పాటు కేపీహెచ్‌బీ కాలనీ 1వ రోడ్డు కమాన్ ఎదురుగా గోవింద్ హోటల్ చౌరస్తాలో, నిజాంపేట రోడ్డులోని సంగమిత్ర పాఠశాల వద్ద పెలికాన్స్ సిగ్నల్స్ వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రమాదాలను నివారించేందుకు..
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లపైసైన్ బోర్డులను ఏర్పాటు చేయ డం, సిగ్నల్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. జాతీయ రహదారితో పాటు నిత్యంరద్దీగా ఉండే రోడ్లపై పాదచారుల వంతెనలు అందుబాటులోకి తెస్తున్నాం. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన పిమ్మట మొదటగా 9 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్, 5 పెలికాన్స్ సిగ్నల్స్ లను ఏర్పాటు చేస్తునాన్నారు. ఈ పనులన్నీ పూర్తైతే రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి. వాహనదారులు.. బాటాసారులు బాధ్యతగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరుతున్నాం.