Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ దగ్గర రన్ ప్రారంభం కానుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు మారథాన్ కొనసాగనుంది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోటరీ, పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు, జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 45 వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు.
పంజాగుట్ట, లిబర్టీ, ముషీరాబాద్, రాణిగంజ్, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయొచ్చని పోలీసులు సూచించారు.