CPR | మెహిదీపట్నం, నవంబర్ 8: రోడ్డుపై పడి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన శుక్రవారం మెహిదీపట్నం నానల్‌నగర్‌లో చోటు చేసుకుంది. లంగర్‌హౌస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కథనం ప్రకారం.. నానల్‌నగర్ బస్టాప్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు సుబ్బారెడ్డి గమనించి.. అతడు గుండెనొప్పితో పడిపోయినట్లు గ్రహించి ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ఊపిరి పోశాడు.అనంతరం అతడిని అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడు సమీపంలోని సాలార్జంగ్ కాలనీలో నివసించే మహ్మద్ ఖలీలుద్దీన్(36)గా గుర్తించారు. ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ హోంగార్డు సుబ్బారెడ్డిని గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్ అంజయ్య అభినందించారు.