సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రదేశాల్లో యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో నగర పరిధిలోని అన్ని సరిళ్లలో ప్రధానంగా.. బషీర్‌బాగ్, సెక్రటరియేట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండే 19మందిని గుర్తించి బల్దియా షెల్టర్ హోమ్‌లకు తరలించారు.
యూసిడీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాచకుల తరలింపులో 221 మందిని గుర్తించగా వీరిలో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 పిల్లలున్నారని పేర్కొన్నారు. పోలీసుల సహకారంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సొంత ఊర్లకు, నివాసాలకు, కుటుంబ సభ్యుల వద్దకు పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు.