Psychology | సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 ( నమస్తే తెలంగాణ) : పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థి ఆత్మహత్య.. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ రాలేదని తనువు చాలించిన ఓ నిరుద్యోగి.. కుటుంబ కలహాలతో మరొకరు.. దాంపత్య జీవితంలో విసుగుచెంది ఇంకొకరు…అప్పుల బాధ భరించలేక మరొకరు..ఇలా క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడి తమ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఒక్క క్షణం.. ఆలోచిస్తే.. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది…కానీ అలా చేయకుండా చాలా మంది ఆత్మహత్యల వైపునకు అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకోగా, దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైం రికార్డు బ్యూరో) గణాంకాలు చెబుతున్నాయి. కారణాలేమైనా.. చిన్న చిన్న సమస్యలతో వందేండ్ల జీవితాలను బలితీసుకుంటున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడాలని..ఆత్మహత్య ఆలోచనలను తరిమి కొట్టాలని ఈ సందర్భంగా నిపుణులు సూచిస్తున్నారు.
భయం, దిగులు, అవమానాలు, అనుమానాలు, జీవితం పట్ల అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం, సర్దుబాటు ధోరణులు లేకపోవడం. ప్రతికూల ఉద్వేగాలైన ఒత్తిడి, భయం, అశాంతి, అభద్రత, నిరాశ, నిస్పృహ. ఓటమి, అనుమానం, మనోభావాలకు భంగం కలగడం. ఉద్రేకపూరిత మనస్తత్వం, అప్పులు, నష్టాలు, ఆర్థిక పరిస్థితి తారుమారు, అంచనాలు విఫలం కావడం. మానసిక స్థితిని ప్రభావితం చేసే శారీరక వ్యాధులైన హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. అయిష్టత, ప్రేమ వ్యవహారాలు, జీవిత భాగస్వామి దూరం కావడం, విడాకులు, వివాహేతర సంబంధాలు, దాంపత్య గొడవలు, లైంగిక సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, సభ్యుల మధ్య విభేదాలు వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. కాగా, అత్యధికంగా దేశంలో 28 శాతం బలవన్మరణాలు కుటుంబ సమస్యలతోనే జరుగుతున్నాయని నివేదికలు వెల్లడించాయి.
మెదడులో రసాయనిక సమతుల్యత లేకపోవడం కూడా ఆత్మహత్యకు కారణమవుతున్నదని మానసిక నిపుణులు చెబుతున్నారు. న్యూరో ట్రాన్స్మీటర్స్ లేక న్యూరో కెమికల్స్ మెదడులో చురుకుగా లేకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే మన చుట్టూ ఉండేవాళ్లు ఎలాంటి ఇబ్బందులతో సతమతమవుతారో మనకు తెలిసే అవకాశం కొంతైనా ఉంటుంది. అలాంటి సమయంలో వారికి మనం బాసటగా ఉంటే.. వారు ఆత్మహత్య చేసుకోకుండా రక్షించిన వారమవుతామని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అనేది 2021-23 ప్రపంచ ఆత్మహత్యల నివారణ నినాదంగా నిర్దేశించారు. జీవితం పట్ల అందరికీ నమ్మకం కలిగించడమే దీని లక్ష్యం.
గుర్తిద్దాం..
ఒత్తిడి, అశాంతి, భయం, అభద్రత, నిరాశ, తదితర మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓటమి, అవమానం భరించలేక కొందరు ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. మరికొందరు తమకు ఏదో అవుతుందనే అనవసర భయాల వల్ల కూడా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆ వ్యక్తి పరిస్థితి పరిశీలిస్తే మెదడులో సెరాటోనిన్ అనే రసాయనిక ద్రవం పూర్తిగా తగ్గిపోతుంది. తీవ్రమైన బాధతో కనిపిస్తారు. ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలోకి వెళ్లిపోతారు. చిన్న కారణమే అయినా వారికి పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వారిని గుర్తించి అండగా ఉంటే ప్రాణాలను కాపాడినవాళ్లమవుతాం. మన చుట్టూ ఉండే వాళ్లతో స్నేహపూర్వకంగా ఉంటూ ఒకరి సమస్యకు మరొకరు తోడుగా నిలవాలి. సమస్యకు పరిష్కారం ఉందని ధైర్యం చెప్పాలి. వారి ఆత్మహత్య ఆలోచనలను తరిమి వేయాలి.
– మోతుకూరి రామచంద్ర, కౌన్సెలింగ్ సైకాలజిస్టు