సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఇంట్లో పిల్లలుంటే ఇంటికే అందం. అల్లరితో సందడి చేస్తూ, చిరునవ్వులను చిందిస్తూ ఆడిపాడుతుంటారు. వారి అల్లరి పనులతో ఇంటిల్లిపాది కష్టసుఖాలను కూడా మర్చిపోతారు. కానీ ఆడిపాడాల్సిన వయస్సులో ఎవరితో మాట్లాడకుండా, తమలో తామే ఏకాంతంగా గడపడం, జనాల మధ్యలో ఉంటే చిరాకు పడటం, నేరుగా ఎదుటివారి కళ్లలోకి చూసి మాట్లాడకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోకపోవడం, కారణాలు లేకుండా ఏడవటం వంటి సమస్యలతో బాధపడుతూ ఆటిజానికి గురవుతున్నారు. సకాలంలో గుర్తించకుండా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడంతో, ఆటిజం పేరుతో ప్రైవేట్ తెరపీ సెంటర్లు వేలల్లో వసూలు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఆవగాహన కల్పించేందుకు ప్రతి యేటా ఏప్రిల్ 2న ‘ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ‘గా జరుపుతున్నారు.
తిరిగి తెరపీకి రావడం లేదు..
మానసిక ఎదుగుదల లోపంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో వంద మందిలో ఒక్కరు మాత్రమే లక్షణాలతో బాధపడేవారు. ప్రస్తుతం 40 మందిలో ఒక్కరు ఇబ్బందిపడుతున్నారు. ప్రతిరోజు నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్న డిస్టిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డీఈఐసీ)కు తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకోస్తున్నారు. ప్రతినెల సుమారుగా 150 మంది చిన్నారులు థెరఫీకోసం వస్తున్నారు. వీరిలో అధికంగా మూడేండ్ల నుంచి ఆరేండ్ల వయస్సు వారే అధికం.
నయం కావాలంటే తెరపీ మాత్రమే సరైన మార్గం. బాధితులకు ఆక్యుపేషనల్, స్పీచ్, బిహేవియర్ థెరఫీలను స్థాయిని బట్టి ఇస్తుంటారు. థెరఫీలు సకాలంలో చేయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల నెలలు గడిచినా చిన్నారుల్లో మార్పు కనిపించడం లేదు. నిలోఫర్లోని సెంటర్కు పలు ప్రాంతాల నుంచి వచ్చే వారు క్రమంగా రావడం లేదని తెలిసింది. అంతేకాకుండా థెరఫీ పూర్తికాకుండానే వెళ్లిపోవడం, తిరిగి ఏడాది తరువాత వచ్చి చూపించుకోవడం వల్ల తిరిగి మొదటినుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బోయిన్ పల్లిలో..
బొల్లారం, ఏప్రిల్ 2: జాతీయ మేధో దివ్యాంగుల సాధికారిత సంస్థ బోయిన్ పల్లి లో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆటిజంపై జాతీయ మేథో దివ్యాంగుల సాధికారత సంస్థ కేంద్రం నుండి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ అంబేద్కర్ విగ్రహం వరకు సుమారు 500 మంది సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. డైరెక్టర్ బివి. రామ్ కుమార్ మాట్లాడుతూ.. న్యూరోడైవర్సిటీని ముందుకు తీసుకువెళ్లడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే విషయం పై దివ్యాంగుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఎన్ఈఐపీఐడీ సంస్థ ప్రిన్సిపాల్ గణేష్ షేరిగర్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
తెరపీ ముసుగులో ప్రైవేట్ దందా..
నగరంలో ఆటిజం తెరపీ దందా పేట్రేగిపోతోంది. కేవలం ఒక్కసారి ఒక్క తెరపీ చేసినందుకే రూ.8వేల వరకు తీసుకుంటున్నారు. అంతేగాకుండా అర్హతలేని సిబ్బందిని పెట్టి వారికి శిక్షణిస్తూ ఆటిజం బాధితులపై ప్రయాగం చేస్తున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో థెరఫీ కేంద్రాలను నిర్వహిస్తూ అమాయకుల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. సుమారు హైదారాబాద్ నగరంలో 100కు పైగా కేంద్రాలు ఉండగా, వాటిల్లో ఉండే సిబ్బంది అంతా అనర్హులే కావడం గమనార్హం.
ఆటిజం పట్ల అవగాహన కల్పించాలి
– డాక్టర్ రవికుమార్, నీలోఫర్ సూపరింటెండెంట్
తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 2 పిల్లలో ఆటిజం లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించి వారి కుటుంబాలకు అవగాహన కలిపించడంతో పాటు వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే ఆ సమస్య నుంచి కొంత వరకు బయటపడేందుకు అవకాశం ఉంటుందని నీలోఫర్ దవఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. రవికుమార్ అన్నారు. నీలోఫర్ దవఖానలో ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా ఆటిజంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఆటిజం మూడు సంవత్సరాల వయస్సులో కనిపిస్తుందని అన్నారు. మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని వారి ప్రవర్తన సామాజిక చర్యలను ప్రభావితం చేయడం ద్వారా ఆటిజంను గుర్తించవచ్చని అన్నారు.
అపోహలొద్దు..
– డాక్టర్ ఎం.హృషికేష్ గిరిప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, చిన్నపిల్లల సైకియాట్రి, నిలోఫర్ ఆసుపత్రి
ఆటిజం పట్ల తల్లిదండ్రులు ఆపోహలు వీడాలి. పిల్లలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాల్సిందే. నయమయ్యేంత వరకూ థెరపీ మాత్రం తప్పనిసరి చేయించాలి. ఇతర పిల్లలతో స్నేయం చేయనివ్వండి.
వారిని అర్థం చేసుకోండి..
– రెబిక, చైల్డ్ సైకాలజిస్టు, డీఈఐసీ సెంటర్
తల్లిదండ్రులుగా పిల్లలను నిరంతరం ప్రోత్సహించాలి. చిన్నారుల ఆలోచనలు పంచుకోవాలి. ఆటిజం వల్ల బాధపడాల్సిన అవసరం లేదు. సకాలంలో థెరపీ అందించడంతో ఆ సమస్యకు చెక్ పెట్టినవాళ్లమవుతాం. ఆటిజంపై అవగాహన కలిగిఉండాలి
గమనిస్తుండండి..
తమ పిల్లలు ఇంట్లో ఏ విధంగా నడుచుకుంటున్నారన్న సంగతి తల్లిదండ్రులు గమనిస్తుండాలి. నిత్యం ఫోన్, టీవీల్లో మునిగిపోకుండా మైదానాలకు పంపించి క్రీడా స్ఫూర్తిని పెంచాలి. వారి నుంచి ఏకాంతాన్ని దూరం చేసేందుకు తప్పనిసరిగా వారితో మాట్లాడుతుండాలి. సమస్యలను గుర్తించి ధైర్యం చెప్పాలి. ఆటిజం లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నారులను డే కేర్ సెంటర్ల నుంచి దూరం చేసి తల్లి ప్రేమకు దగ్గరచేయాలి.