
సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): సమాజంలో ఉన్నత విలువలకు నిలయంగా సాహిత్యం నిలుస్తున్నదని ఇఫ్లూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఇ.సురేశ్ కుమార్ అన్నారు. సమాజ మార్పు కోసం ఉన్నతమైన రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానంగా దివంగత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ రాసిన రచనలు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయన్నారు. ఆయన మన మధ్య లేకున్నా నరేంద్ర లూథర్ సృష్టించిన సాహిత్యం సమాజాన్ని ఉన్నత విలువల వైపు నడిపిస్తుందన్నారు. నరేంద్ర లూథర్ రాసిన ‘ది ఫ్యామిలీ సాగ’ అనే నవలను ప్రొఫెసర్ సురేశ్ కుమార్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్‌సింగ్, వ్యాలీ ఆఫ్ వర్డ్స్, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ సంజీవ్ చోప్రా ఆవిష్కరించారు. ఈ పుస్తకం దివంగత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్కు సంబంధించిన విభజన సమయం నాటి అంశాలను గుర్తు చేస్తున్నదన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ సెంటర్లో రెండు రోజులు వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్, యంగ్ అడల్ట్ లిటరేచర్ అండ్ ట్రాన్స్లేషన్ పేరుతో సాహిత్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పలు భాషల్లో రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. సంజీవ్ చోప్రా మాట్లాడుతూ, సాహి త్య ఉత్సవాలను అక్టోబర్ 9 నుంచి నవంబర్ 21వరకు దేశంలోని ఐదు నగరాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్ ఫెస్టివ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు భాషలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాషా సాహితీవేత్తలు పాల్గొన్నారు.