సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : చేసేది అక్రమమైనా.. అందులోనూ నిజాయితీ ఉండాలంటారు పెద్దలు! కానీ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ టెండర్ల కమీషన్ల బాగోతంలో సరిగ్గా ఆ నిజాయితీనే లోపించింది. ముఖ్యంగా ‘ధర్మ’రాజులా అందరికీ సమ న్యాయం చేయాల్సిన మధ్యవర్తి ఒకరి పక్షం వహించడంతో పాటు రెండోపక్షాన్ని సంతృప్తి చేసేందుకు మరో మోసానికీ స్కెచ్ వేశాడు. కాకపోతే ఒక్కసారి మోసపోయి.. ఇరుక్కుపోయిన కాంట్రాక్టర్ రెండోసారి ఆ తప్పు చేసేందుకు సాహసించడం లేదు. అందుకే మీ చెరువొద్దు.. మీ టెండర్లొద్దు.. అప్పటికే ఇచ్చిన కమీషన్ వాపస్ ఇవ్వండి మహాప్రభో అంటూ ప్లేటు ఫిరాయించాడు. ఇంకేముంది.. కమీషన్ల వ్యవహారాన్ని సక్రమంగా నడపాల్సిన మధ్యవర్తి బుద్ధి దారి తప్పడంతో అసలుకే ఎసరు పడింది. దీంతో తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులు ‘ధర్మ’సంకటంలో పడినైట్లెంది.
నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులకు హెచ్ఎండీఏ రూ.9.90 కోట్లతో పిలిచిన టెండర్ల వెనక ‘ముఖ్య’నేత సన్నిహితుడు, షాడో సీఎం రంగం ప్రవేశం చేసి, ఓ కంపెనీకి పనులు అప్పగించడంతో త న కమీషన్ వాటా తేలాలంటూ స్థానిక ప్రజాప్రతినిధి పనుల్ని అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం ప్రచురితం కావడంతో అప్రమత్తమైన కొందరు ప్రభుత్వ పెద్దలు వ్యవహారాన్ని సర్దుబాటు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారం ఆరినట్లే ఆరి… కమీషన్ల సెగ మళ్లీ అంటుకుంది. ఈసారి మాత్రం ఆరేలా కనిపించడం లేదు.
వాస్తవానికి షాడో సీఎం ఆదేశాల మేరకు సదరు కంపెనీకి అనుకూలంగా టెండర్‌ను ఖరారు చేయడంలో ఓ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. టెండర్ ఖరారయ్యే వరకు షాడో సీఎంకు కమీషన్ ముట్టజెప్పే వరకు తన ‘ధర్మ’ంగా కర్తవ్యాన్ని బాగానే నిర్వహించాడు. కానీ ఎప్పుడైతే స్థానిక ప్రజాప్రతినిధి ఇందులో జోక్యం చేసుకొని వ్యవహారం రచ్చ కావడంతో.. సదరు మధ్యవర్థి అందరికీ ధమ్కీలు ఇవ్వడం మొదలుపెట్టినట్లు తెలిసింది.అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ను సైతం బెదిరించి పనులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అయితే స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం అందుకు ససేమిరా అంటూ పనులు మొదలుపెట్టొద్దంటూ అధికారులకు హుకూం జారీచేసినట్లు తెలిసింది. దీంతో మరో పనిలో తాను సర్దుబాటు చేస్తానని మధ్యవర్తి ఎంత చెప్పినా ప్రజాప్రతినిధి మాత్రం పట్టు వీడటం లేదని సమాచారం. పైగా తన కమీషన్ కోసం ఎంతవరకైనా పోయేందుకు సిద్ధమని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే ఇచ్చిన కమీషన్ మినహా స్థానిక ప్రజాప్రతినిధికి చిల్లిగవ్వ తన చేతి నుంచి ఇవ్వనని కాంట్రాక్టర్ కుండబద్దలు కొట్టడంతో షాడో సీఎంతో పాటు మధ్యవర్తికి ఏంచేయాలో పాలుపోవడం లేదు.
షాడో సీఎం కమీషన్లో ‘సింహ’భాగం ఉంచుకొని కొంత స్థానిక ప్రజాప్రతినిధికి ఇచ్చేందుకు అంగీకరించినా తాను అనుకున్నస్థాయిలో కమీషన్ వాటా రావాల్సిందేనని ప్రజాప్రతినిధి తెగేసి చెప్పడంతో మధ్యవర్తి కొత్త స్కెచ్‌కు తెరలేపినట్లు తెలుస్తున్నది. ముందైతే చెరువు సుందరీకరణ పనులు మొదలుపెట్టేందుకు అంగీకరించాలని… కాంట్రాక్టర్ యంత్రాలను అక్కడికి తరలించి పనులు మొదలుపెట్టిన తర్వాత ‘సంతృప్తి’కరంగా మరోసారి కమీషన్ల కోసం పట్టుబడదామని మధ్యవర్తి.. ప్రజాప్రతినిధికి సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎలాగూ పనులు మొదలుపెట్టినందున కాంట్రాక్టర్ వెనక్కి పోయే పరిస్థితి ఉండదని, అప్పుడు ఎంత కావాలంటే అంత గుంజుకోవచ్చని మధ్యవర్తి పెద్ద స్కెచ్ వేశాడు. అయితే ఈ స్కెచ్‌ను ముందుగానే గుర్తించాడో… తనకే ఏదో తేడా కొట్టిందోగానీ కాంట్రాక్టర్ ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ పనులొద్దు… టెండర్లు అసలే వద్దు… షాడో సీఎంకు ఇచ్చిన కమీషన్ వాపస్ ఇస్తే తన దారిన తాను పోతానని కాంట్రాక్టర్ చెప్పడంతో మధ్యవర్తి షాక్ అయినట్లు తెలిసింది. దీంతో రూటుమార్చి… పనులైతే మొదలుపెట్టు, ఆపై తానే కాంట్రాక్టు తీసుకొని పనులు పూర్తిచేస్తానని మధ్యవర్తి నమ్మబలుకుతున్నా కాంట్రాక్టర్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడంలేదని సమాచారం. ఒకవైపు పనులు మొదలయ్యే పరిస్థితి లేక… స్థానిక ప్రజాప్రతినిధికి అదనంగా కమీషన్ వచ్చే దారి లేక… కాంట్రాక్టర్ తొలుత ఇచ్చిన కమీషన్ వాపస్ ఇవ్వలేక…మధ్యవర్తి సతమతమవుతున్నట్లు సమాచారం. దీంతో తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులు ప్రస్తుతం ‘ధర్మ’ సంకటంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పంపకాల గోల తేలేదెప్పుడు? పనులు మొదలయ్యేదెన్నడు? అని అధికారులతో పాటు స్థానికులు ఎదురుచూస్తున్నారు.