జవహర్‌నగర్, మే 7: బతుకు దెరువు కోసం రాష్ర్టాలుదాటి వచ్చి కుటుంబాలను పోషించుకుని నాలుగు పైసలు సంపాదించుకుందామకుని ఆశపడ్డ కార్మికుల జీవితాలు అడియాశలయ్యాయి… అందరితో కలిసి పనికోసం వెళ్లిన యువకులను లిఫ్ట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని డంపింగ్‌యార్డ్ పవర్‌ప్లాంట్ ఫేస్-2 చిమ్నీలో బుధవారం కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఉదయం 11గంటల సమయంలో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న క్రమంలో లిఫ్ట్తెగి పడటంతో అక్కడే పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కార్మికులు సూరజ్ సర్కార్(25), ప్రకాశ్ మండల్ (29), ఉత్తరాఖండ్‌కు చెందిన అమిత్రాయ్(25) తీవ్రగాయాలపాలై ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. పోలీసులు మృతదేహాలను గాంధీ దవాఖానాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిబంధనలు పట్టించుకోని యాజమాన్యం..!
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌లో కార్మికులు పనిచేసే క్రమంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే కార్మికులు దుర్మరణం పాలయ్యారని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. డంపింగ్‌యార్డ్‌లో సుమారు 15ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి సేఫ్టీని యాజమాన్యం కల్పించడంలేదని, దీంతో ఎంతోమంది కార్మికులు తమ కాళ్లను, చేతులను, ప్రాణాలను పోగొట్టుకున్నారని వారు ఆరోపించారు.
ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించరు.హెచ్ఎంఈఎస్పీఎల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ కూలిన ఘటనలో తమ తోటి కార్మికులను కోల్పోయిన వారు కూడా పనిచేసే చోట తమకు తగిన సేఫ్టీ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలను యాజమాన్యం అన్నివిధాలుగా ఆదోకోవాలని వారు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
లిఫ్ట్ కూలి కార్మికులు చనిపోయిన ఘటనపై హెచ్ఎంఈఎస్పీఎల్ యాజమాన్యం స్పందించింది. ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.