సికింద్రాబాద్ : ముగ్గురు ప్రాణస్నేహితులు…. బాల్యస్నేహితులు…. జల్సాలకు అలవాటు పడ్డారు… తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారు. నిషేదిత హాష్ ఆయిల్ బాటిళ్లను విక్రయిస్తుండగా ముగ్గురిని లాలాగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాలాగూడ పోలీస్ స్టేషన్ సీఐ మధులత, డీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేట్ పొచమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన హేమంత్ అలియాస్ విక్కీ (22) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
మల్కాజిగిరి వసంతపురి కాలనీ సాయిమిత్ర ఎన్‌క్లేవ్‌కు చెందిన సాయి కిరణ్ ( 23) విద్యార్థి, సఫిల్‌గూడ ప్రాంతానికి చెందిన అఖిల్ ( 22) విద్యార్థి. ఈ ముగ్గురు బాల్య స్నేహితులు ఒకే బాట, ఒకే మాటమీద నిలబడుతారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నారు.
గత కొంత కాలం నుంచి మంగళహాట్ నుంచి హాష్ అయిల్ బాటిళ్లు తీసుకుచ్చి గ్రాముల చొప్పున లాలాపేట్‌లోని జీహెచ్ఎంసీ మైదానంలో దొంగచాటుగా విక్రయిస్తున్నారు. విశ్వనీయ సమాచారం అందుకున్న లాలాగూడ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు రితేందర్సింగ్, హరికుమార్, మహేష్ కుమార్, గోపాల్‌లు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జీహెచ్ఎంసీ మైదానంలో ముగ్గురు కనిపించడంతో వారిని గుర్తించి ఆదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 20 ఎంఎల్ నాలుగు హాష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన అఖిల్ పై గతంలో విజయనగరం జిల్లాలో ఒక కేసు, లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు అయినట్లు సీఐ పేర్కొన్నారు.