మెహిదీపట్నం, మే 15: వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి మాసబ్‌ట్యాంక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 15 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వివరాల ప్రకా రం… మాసబ్ ట్యాంక్ షెహబాజ్ ఖాన్ (29), యాకుత్‌పుర మురుతుజా నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఇస్మాయిల్ (30), పాతబస్తీ శాలివాహన నగర్‌కు చెందిన కడారి రమేశ్ (52)లు ఉన్నత విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు.
గురువారం మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో షెహబాజ్ ఖాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అబ్దుల్ ఇస్మాయిల్ గురించి చెప్పగా.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో రమేశ్‌ను పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు అవసరమైన వారి ఆధార్ కార్డులను తీసుకొని ఢిల్లీలో ఉన్న సాగర్‌కు రమేశ్ పంపుతాడు. సాగర్ సర్టిఫికెట్లను తయారుచేసి తిరిగి రమేశ్‌కు పంపుతాడు. ఇక్కడ వీరు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.80వేలు వసూలు చేస్తున్నారు. ఈ ముగ్గరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.