
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో నగరానికి మూడో కన్నుగా మారనుందని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నాలుగు టవర్ల భవనం, 20 అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక మ్యాప్‌లను ఆర్ అండ్ బీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సీపీకి వివరించారు. భవనంలో భద్రత ప్రమాణాలు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలతో పాటు సమావేశ మందిరాలు, ఆడిటోరియాలు, పార్కింగ్ ప్రాంతాలను సీపీ సందర్శించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాల అమలు కోసం ఏజెన్సీలు, విక్రేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీపీ సూచించారు. నగర పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంటుందని, మార్చి 31వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడ్మిన్ డీసీపీ సునీతారెడ్డి తదితరులు ఉన్నారు.