Hyderabad | రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రత్యేకం. ఎందుకంటే.. పేరుకు అవి నియోజకవర్గమైనా.. అదే పేరుగల భౌగోళిక ప్రాంతం మరో నియోజకవర్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఓటర్లు మరో నియోజకవర్గంలో ఓటేస్తారు. ఒకే ప్రాంతం రెండు నియోజకవర్గాల్లో ఉండి, అక్కడి ఓట్లు రెండు నియోజకవర్గాల్లో ఓట్లేసేవీ ఉన్నాయి. ఇలాంటివి హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నాయి.
☞ జూబ్లీహిల్స్ 2009లో కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఇది వరకు ఖైరతాబాద్‌లో అంతర్భాగంగా ఉండేది. ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గమే పునర్విభజనలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలుగా ఏర్పడింది. అయితే జూబ్లీహిల్స్ ప్రాంతం, జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంత ఓటర్లంతా ఖైరతాబాద్ ఎమ్మెల్యేను ఎనుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పేరుతో అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నా.. జూబ్లీహిల్స్ ప్రాంతం, డివిజన్ లేకుండా అదే పేరుతో ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యింది.
☞ సికింద్రాబాద్ 1952 నుంచి కొనసాగుతున్న నియోజకవర్గం. సికింద్రాబాద్ అంటేనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మోండామార్కెట్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం. కానీ ప్రాంతం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో లేదు. సికింద్రాబాద్ స్టేషన్ సహా ఆయా ప్రాంతాలన్నీ సనత్‌నగర్ నియోజవర్గం కిందికి వస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ దాటిన తర్వాత సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధి ప్రారంభమవుతుంది.
☞ చార్మినార్ చారిత్రక కట్టడం, ఈ పేరుతో రెవెన్యూ మండలం, అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. అయితే చార్మినార్ కట్టడం గల ప్రాంతం రెవెన్యూపరంగా బహద్దూర్‌పుర మండలం కిందికి వస్తుంది. ప్రస్తుతం బహద్దూర్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్ సైతం ఉంది.
☞ ఓల్డ్ బోయినపల్లి, న్యూ బోయినపల్లి ప్రాంతాలు దాదాపు కలిసే ఉంటాయి. అయితే ఓల్డ్ బోయిన్పల్లి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోకి రాగా, న్యూ బోయినపల్లి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
☞ కూకట్పల్లి నియోజకవర్గానికి అనుకుని ఉండే ప్రాంతాలు అనుకుని ఉండే ప్రాంతాలు, అల్విన్‌కాలనీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోకి వస్తాయి.
☞ ఉప్పల్, బోడుప్పల్ రెండూ దాదాపు కలిసే ఉంటాయి. ఉప్పల్ పేరుతో ప్రత్యేకంగా నియోజవర్గం ఉండగా, బోడుప్పల్ ప్రాంతం మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది.