
కరోనా నివారణకు ఇప్పటికే రెండు డోస్‌ల టీకా తీసుకున్న వారికి బూస్టర్ (ప్రికాషనరీ) డోస్ ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని జిల్లా దవాఖానలు, ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో బూస్టర్ టీకా వేయనున్నారు. గ్రేటర్ పరిధిలో 18 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోస్ వందశాతం పూర్తికాగా, రెండో డోస్ 80 శాతం పైగా నమోదైంది. ఈనెల 3 నుంచి ప్రారంభమైన టీనేజర్ల(15-18 ఏండ్లు)కు టీకాల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రస్తుతం విద్యాసంస్థలకు సెలవులు రావడంతో యువత భారీగా తరలివచ్చి టీకాలు తీసుకుంటున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. ఒకవైపు వ్యాక్సినేషన్లో మొదటి డోసును నూరు శాతం పూర్తి చేసిన ప్రభుత్వం రెండో డోసును సైతం వందశాతం పూర్తి చేసేందుకు చర్యల్ని మరింత వేగం చేసింది. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సోమవారం నుంచి ప్రికాషనరీ (బూస్టర్) డోసుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు డిస్ట్రిక్ట్ వైద్యశాలల్లోనూ బూస్టర్ డోసుల పంపిణీని చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు 60 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును అందుబాటులో ఉంచనున్నారు.
నేటి నుంచే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొవిడ్ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ, అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత వేగాన్ని పెంచింది. ఒక వైపు 18 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి మొదటి డోసు వంద శాతం పూర్తయినందున… రెండో డోసును కూడా నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం రెండో డోసు 83 శాతం వరకు పూర్తవగా.. మేడ్చల్ జిల్లా పరిధిలోనూ దాదాపు 83 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి పరిధిలో రెండో డోసు 82 శాతం పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో మొదటి డోసు తీసుకున్న వారిలో చాలామంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లి రెండో డోసు తీసుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలోనే రంగారెడ్డి పరిధిలోనూ రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక 15-18 మధ్య వయసున్న టీనేజర్స్‌కు ఈ నెల 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 5.90 లక్షల మంది టీనేజర్స్‌కు మొదటి డోసు వ్యాక్సిన్ వేసేందుకుగాను 174 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మొదలు కానున్న ప్రికాషనరీ (బూస్టర్) డోస్‌ను కూడా ఈ వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాగూ హెల్త్ వర్కర్స్ తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాల్లో బూస్టర్ డోసును వేయించుకోనున్నారు. వీరితో పాటు 60 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు కూడా సోమవారం నుంచి బూస్టర్ డోసును ప్రారంభించనున్నారు. వీరు ప్రస్తుతం రెండో డోస్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు టీనేజర్స్ కోసం గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన 174 కేంద్రాల్లో బూస్టర్ డోసును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో పని చేసే పారిశుధ్య, ఇతర సిబ్బంది… ఆపై పోలీసు, రెవెన్యూ శాఖల వారికి దశలవారీగా బూస్టర్ డోసును విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో తీసుకున్నదే..
ఇప్పటివరకు రెండు డోసులు ఒకే వ్యాక్సిన్‌ను వేయించుకోడమనేది సాధారణం. అటు కొవాగ్జిన్ గానీ, ఇటు కొవిషీల్డ్ గానీ ఏదో ఒకటి రెండో డోసులు వేయించుకున్నారు. ఈ క్రమంలో మూడో డోసు కూడా
అదే వేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేస్తున్నది. మొదటి రెండో డోసులు కొవాగ్జిన్ వేసుకున్న వారు మూడోది కూడా అదే వేయించుకోవాలని, ఒకవేళ కొవిషీల్డ్ వేయించుకున్న వారు అదే వేయించుకోవాలని చెబుతున్నారు. క్రాస్ వ్యాక్సిన్… అంటే మొదటి రెండో డోసులకు భిన్నంగా వ్యాక్సిన్‌ను మార్చడాన్ని మాత్రం అమలు చేయడం లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. క్రాస్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉంటుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నా ప్రభుత్వపరంగా ఇది అధికారికం కానందున తాము క్రాస్ వ్యాక్సిన్‌ను అమలు చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం..
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మార్కెట్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నాం. ఇప్పటికే నగరంలో దాదాపుగా 99 శాతం ఫస్ట్, సెకండ్ డోస్ టీకా పక్రియను పూర్తి చేశాం. పెరుగుతున్న కేసుల తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నాం. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-2111 1111 ద్వారా 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాం. కరోనాతో ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. స్వీయ జాగ్రత్తలతో మహమ్మారిని కట్టడి చేయవచ్చు. ప్రతిఒక్కరూ మాస్కులతో పాటు సామాజిక దూరం పాటించాలి.
నేటి నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్..
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సోమవారం నుంచి బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 22 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా.. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టారు. రెండు మూడు రోజుల్లో అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
10 మంది హౌస్సర్జన్లకు కరోనా
సుల్తాన్‌బజార్, జనవరి 9: ఉస్మానియాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది హౌస్ సర్జన్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజులుగా వారు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో దవాఖాన పాలక వర్గం వారిని హోం ఐసొలేషన్ చేసింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు హౌస్సర్జన్లతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, రేడియాలజీ విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచించారు.