సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్ పోర్టల్ వెబ్సైట్ తప్పుల తడకగా ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పరిధిలోని జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల పేర్లను గల్లంతు చేశారు. రెండేండ్ల కిందట బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ విశ్వజిత్ కంపాటి ఇంకా బల్దియాలోనే పనిచేస్తున్నారు. అయితే ఇంకా అడ్వైర్టెజ్మెంట్, ట్రాన్స్పోర్టు అడిషనల్ కమిషనర్గా విశ్వజిత్ కంపాటి పేరు కనిపిస్తుండటం గమనార్హం. ఇదే వరుసలో పలువురు ఐఏఎస్లు, ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీలోనే కొనసాగిస్తున్నట్లు చూపారు.
నాగర్ కర్నూల్లో కలెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ సంతోష్ బదావత్ వెబ్సైట్లో ఇంకా జీహెచ్ఎంసీ అడిషనల్ హెల్త్గానే ఉంది. ప్రియాంక ఆల, శృతి ఓజాలు బదిలీ అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వారి పేర్లే దర్శనమిస్తున్నాయి. చార్మినార్ జోనల్ కమిషనర్గా రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వెంకన్న స్థానంలో ఇంకా అశోక్ సామ్రాట్ పేరే ఉంది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా రవికిరణ్ ఉండగా, బి. శ్రీనివాస్రెడ్డినే కొనసాగించారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా నాలుగేండ్ల పాటు పనిచేసి వెళ్లిపోయిన జయరాజ్ కెన్నెడి పేరు ఇంకా తొలగించలేదు.
కొత్తగా వచ్చిన అధికారుల పేర్లు అప్డేట్ కాలేదు అనుకుంటే పొరపాటే..జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి, హైడ్రా కమిషనర్గా రంగనాథ్, అలాగే జోనల్ కమిషనర్లు వచ్చినా ఐఏఎస్ల పేర్లు మార్చినప్పటికీ మిగతావి మాత్రమే అలాగే ఉంచడం ఐటీ అధికారుల పనితీరుకు నిదర్శనం. లక్షల జీతాలు తీసుకుంటూ కనీసం వెబ్సైట్ను కూడా సరిగా అప్డేట్ చేయని పరిస్థితి ఐటీ విభాగంలో నెలకొనడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్న తరుణంలో ఇలా తప్పుడు సమాచారం వెబ్సైట్లలో ఉంచడం సర్కారు పనితీరుకు అద్దం పడుతున్నది.