సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : యువత వ్యక్తిత్వ వికాసానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రామకృష్ణ మఠంలో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరై మాట్లాడారు.
1893 సెప్టెంబర్ 11న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడవాలని సూచించారు. అనంతరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. 25 ఏండ్ల క్రితం సెప్టెంబర్ 11న రామకృష్ణ మఠంలో మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని చెప్పారు.
ఇప్పటి వరకు 20లక్షల మందికిపైగా యువతకు వ్యక్తిత్వ వికాసం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డౌక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వీఐహెచ్ఈ ఫ్యాకల్టీ సభ్యులు, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.