సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా సోలార్ లైట్లతో కూడిన బారికేడ్లను నగర రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ అదనపు సీపీ (ఇన్‌చార్జ్జి) ఏఆర్ శ్రీనివాస్ మంగళవారం ఈ బారికేడ్లను పరిశీలించి, ఆయా పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, ప్రమాదాలను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వేగ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. వాహనాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో జిగ్‌జాగ్‌గా బారికేడ్లు, అదేవిధంగా వాహనదారులు బారికేడ్లను గుర్తించేందుకు వీలుగా లైటింగ్‌ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు జరిగే ప్రమాదాలను 121 నుంచి 97 కు తగ్గించారు. ఈ బారికేడ్ల ఏర్పాటుతో ఆశించిన ఫలితాలు రావడంతో నగర వ్యాప్తంగా మరిన్ని పెంచుతున్నారు.