వెంగళరావునగర్, అక్టోబర్ 8: పోలీసుల వైఫల్యం ఆ కన్నతల్లికి తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. ఖాకీల్లో కొరవడిన సమన్వయ లోపంతో కన్నబిడ్డ కడసారి చూపునకు నోచుకోలేకపోయింది ఆ మాతృమూర్తి. అదృశ్యం కేసును పోలీసులు సకాలంలో ఛేదించకపోవడం..మృతుడ్ని గుర్తించకపోవడంతో బాధిత కుటుంబం పాలిట శాపంగా మారింది. బాధితుల కథనం ప్రకారం… రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనగర్‌కు చెందిన శ్రీను, లక్ష్మి దంపతుల కుమారుడు డి.దుర్గాప్రసాద్ (30) బిగ్ బాస్కెట్లో మేనేజర్ ఉద్యోగంతోపాటు డెలివరీ బాయ్‌గా కూడా పనిచేస్తుంటాడు.
గత మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటలకు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లోని బిగ్ బాస్కెట్ ఆఫీసుకు వెళ్లాడు. ఆ తర్వాత అతన్ని సంప్రదించేందుకు పలుమార్లు ఫోన్లు చేసినా స్విచ్ఛాప్ వచ్చింది. ఆ మర్నాడు ఏప్రిల్ 1వ తేదీన దుర్గాప్రసాద్ పనిచేసే యూసుఫ్‌గూడలోని బిగ్‌బాస్కెట్ కార్యాలయానికి వెళ్లి విచారిస్తే.. ఆరోజు ఆఫీసుకు వచ్చిన దుర్గాప్రసాద్ రాత్రి 9 గంటలకు ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిపోయాడని సిబ్బంది చెప్పారు. మూడ్రోజులుపాటు అతని జాడ కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఏప్రిల్ 3వ తేదీన అతడి సోదరుడు రాజు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు..
డెలివరీ బాయ్ దుర్గాప్రసాద్ అదృశ్యంపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని మధురానగర్ పోలీసులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిస్సింగ్ కేసు నమోదైన పక్షంలో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం పంపాల్సి ఉంటుంది. నగరంలోని పోలీసు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంటే సంబంధిత ట్రేస్ అయిన పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం తెలుసుకునే వీలుండేది.
అంతే కాకుండా గుర్తు తెలియని మృతదేహాలు, మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఫేస్ రికగ్నేషన్ టీం కూడా ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని బీరాలు పలికే పోలీసులు నాంపల్లిలో లభ్యమైన మృతదేహాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు గానీ.. బాధిత కుటుంబానికి గానీ తెలియపర్చకపోవడం ఆ శాఖ సమన్వయలోపం కనిపిస్తున్నది. ఇంత టెక్నాలజీ ఉన్నా ఆర్నెల్లు గడిచినా మృతుడిని గుర్తించలేకపోవడం పోలీసు స్టేషన్ల మధ్య సహకారం లోపించినట్లు తెలుస్తుంది.
కుటుంబసభ్యుల అన్వేషణ
అదృశ్యమైన దుర్గా ప్రసాద్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు అన్వేషించారు. రెండు రోజులకోసారి మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. వారి ఇంటి సమీపంలోని వారు అనాధ శవాలకు అంతక్రియలు చేసే సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారు. దీంతో రెండు రోజుల కిందట సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌ను కలువడంతో అక్కడ అనాధ శవాల ఫొటోల్లో దుర్గాప్రసాద్ ఫ్యాంటు, షర్ట్, బెల్ట్‌ను చూసి దుర్గాప్రసాద్ ఫొటోను గుర్తుపట్టారు. ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశామని వారు చెప్పడంతో దుర్గాప్రసాద్ తల్లి విలపిస్తూ కుప్పకూలిపోయింది.
కనిపించని మృతుడి ద్విచక్ర వాహనం
ఈ-చలాన్ చెక్ చేయడంతో దొరికిన బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయిన దుర్గాప్రసాద్ ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. అతని బైక్ కూడా 20రోజులపాటు కనిపించలేదు. దుర్గాప్రసాద్ బైక్ నంబర్‌తో ప్రతిరోజూ అతని సోదరుడు రాజు ఈ-చలాన్ చెక్ చేసేవారు. అలా ఓ రోజు పోలీసు ఈ-చలాన్ చెక్ చేయగా.. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద రోడ్డుపక్కన నిలిపి ట్రాఫిక్ ఉల్లంఘనతో ఈ-చలాన్ ఉన్నది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఆ బైక్ లభ్యమైంది. బైక్ లోపల సెల్‌ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీతోపాటు పర్సు, ఆధార్‌కార్డు లభ్యమైంది.
సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌కు మృతదేహం అప్పగింత.. అంత్యక్రియలు పూర్తి
నాంపల్లిలో గత ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. నాంపల్లి మెట్రోస్టేషన్ సమీపంలో మృతదేహం పోలీసులకు లభ్యమైంది. గులాబీ రంగు చొక్కా, నలుపు రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. పరిసర ప్రాంతాలకు అతని ఆచూకీ కోసం అప్పట్లో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటూ నాంపల్లి పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని మృతదేహంగా భావించిన నాంపల్లి పోలీసులు ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌కు మృతదేహాన్ని అప్పగించడంతో.. గుర్తు తెలియని మృతుడిగా భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒకే పోలీసు కమిషనరేట్ పరిధిలోని రెండు ఠాణాల మధ్య లోపించిన సమన్వయ లోపం బాధిత కుటుంబానికి పెనుశాపంగా మారింది.
దుర్గాప్రసాద్‌ది కచ్చితంగా హత్యే
ఘటనాస్థలంలో దుర్గాప్రసాద్ నెత్తుటి మడుగులో చనిపోవడాన్ని బట్టి చూస్తుంటే కచ్చితంగా హత్యేనని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు దుర్గాప్రసాద్ ముఖం, తలపై గాయాలు ఉన్న ఫొటోల్ని పోలీసులు చూపించారని.. ఎవరో తమ బిడ్డను హత్య చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దుర్గాప్రసాద్‌ది హత్యేనా.. తనంతటే తనే ప్రమాదవశాత్తూ చనిపోయాడా.. ఎవరైనా చంపేశారా అనేది మిస్టరీగా మారింది. మృతుడు దుర్గాప్రసాద్ ఒంటిపై గాయాలు ఉన్నాయని..నోట్లోని అతని రెండు పళ్లు విరిగిపోయి ఉన్నాయని అతని కుటుంబీకులు చెబుతున్నారు.
మృతుడి బైక్ బంజారాహిల్స్‌లో 20 రోజుల తర్వాత దొరికిందని.. ఆ బైక్ ఎవరు తీసుకెళ్లారు.. అతనితో పాటు ఉన్నదెవరని పోలీసుల్ని కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. యువతితో ప్రేమ వ్యవహారాలే దుర్గాప్రసాద్ హత్యకు కారణమా?లేక ఆఫీస్ గొడవల్లో ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బ్రెయిన్ హ్యుమరేజ్తో దుర్గాప్రసాద్ మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు తెలిసింది. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీయాలని పోలీసు ఉన్నతాధికారుల్ని మృతుడి కుటుంబీకులు కోరుతున్నారు.
బిడ్డ ఇక లేడని.. తిరిగి రాడని..
ఆరు మాసాల తర్వాతే అమ్మకు తెల్సింది బిడ్డ ఇక లేడని.. తిరిగి రాడని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆరు నెలల తర్వాత సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నారు. ఎక్కడో ఓ చోట తన బిడ్డ భద్రంగా ఉండి ఉంటాడనే ఇన్నాళ్లుగా ఎదురు చూసిన ఆ తల్లి విషయం తెలిసి గుండెలవిసేలా రోదించింది. కన్నబిడ్డ కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయానని రోదిస్తున్న ఆ తల్లిని ఆపడం ఎవరితరం కావడంలేదు.