సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి సెల్‌ఫోన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాచర్ల వద్ద నుంచి మారణాయుధాలు, దొంగిలించిన బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ కథనం ప్రకారం.. ఫలక్‌నుమా, ముస్తఫానగర్‌కు చెందిన మసూద్ ఉర్ రహమాన్ వెల్డర్‌గా, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విలాసాలకు తన సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాల బాట పట్టాడు. 2020లో ఈజీ మనీ కోసం ప్రయత్నించి దొంగతనాలు, స్నాచింగ్ చేయడంతో మైలార్‌దేవ్‌పల్లి, నాచారం పోలీస్స్టేసన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20న తెల్లవారుజామున ముషీరాబాద్‌లోని తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ స్క్రాప్ బిజినెస్ చేసే ఫజల్ ఉర్ రహమాన్‌ను కలిసి, తాను దోపిడీకి వెళ్తున్నానని తనతో రావాలని వెంట తీసుకెళ్లాడు.
దోపిడీ చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వాళ్లపై దాడి చేసేందుకు డాగర్, కత్తితో బయలు దేరారు. చాదర్‌ఘాట్ వైపు వెళ్లి స్వాగత్బార్ వద్ద యాక్టీవా వాహనాన్ని దొంగిలించి, అక్కడి నుంచి ముషీరాబాద్‌లోని బోలక్పూర్ స్టార్ హోటల్ వద్దకు చేరుకొని అక్కడ పార్కు చేశారు. దీనిని తరువాత విక్రయించేందుకు ప్లాన్ చేశారు. అనంతరం తెల్లవారుజామున 2, 3 గంటల సమయంలో సికింద్రాబాద్ గణేశ్ ఆలయం సమీపంలో ఒక వ్యక్తి వెళ్తుండటంతో అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించడంతో బాధితుడు అడ్డుకున్నాడు. ఇద్దరు వాహనం దిగి తమ వద్ద ఉన్న కత్తులతో బాధితుడ్ని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు గట్టిగా అరుస్తుండటంతో యాంటీ స్నాచింగ్ కానిస్టేబుల్ అక్కడకు చేరుకొని దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో బాటా షోరూం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి మళ్లీ పరారై సిటీలైట్ హోటల్ వైపు పరిగెత్తుతుండటంతో వారిని వెంబడిస్తున్న కానిస్టేబుల్ తన వద్ద ఉన్న గన్‌తో ప్రధాన నిందితుడి కాలుపై కాల్చాడు. నిందితులు పారిపోయారు. అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.