అమీర్‌పేట్, ఏప్రిల్ 26 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి మే 2వ తేదీన కొలువుదీరనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాలయ ఈవోను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణలతోపాటు దేవాలయ నూతన పాలక మండలి సభ్యులతో బుధవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెలుగొందుతుందన్నారు.
ప్రతి ఆది, మంగళవారం వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారన్నారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. వీటితోపాటు దేవాలయ పరిసరాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారి కోసం ఆలయ పరిసరాల్లో నిర్మించిన దుకాణాలను మే 4న జరిగే కార్యక్రమంలో వారికి ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో దేవాలయ పాలక మండలి నూతన సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు, సరఫ్ సంతోష్, ఉప్నల యాదగిరి, గౌతమ్‌రెడ్డి, ఆంజనేయులు యాదవ్, దాసోజు పుష్పలత, ప్రభుగౌడ్, అనిల్‌కుమార్, సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.