Amberpet | అంబర్‌పేట, మే 25 : వచ్చే నెల జూన్ 6 నుంచి 8 వ తేదీ మూడు రోజుల పాటు అంబర్‌పేట, శంకర్‌నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీనల్లపోచమ్మ దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ రావుల ప్రదీప్, అధ్యక్షుడు ఎ.బ్రహ్మచారి విగ్రహ ప్రతిష్టాపన వివరాలను ఆదివారం మీడియాకు తెలిపారు.
జూన్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఊరేగింపు, సాయంత్రం 5.30కు గణపతిపూజ, పుణ్యహవచనము, దీక్షాస్వీకారం, రక్షాబంధనం, అంకురార్పణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. జూన్ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి శాంతి పాఠం, మూలమంత్ర హోమాలు, వాస్తు పూజ, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, హోమం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 8వ తేదీన ఆదివారం ఉదయం 7 గంటల నుంచి శాంతి పాఠం, హోమం, మహాపూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, దిష్టికుంభము, మహా కుంభ సంప్రోక్షణ, అనంతరం రేణుక ఎల్లమ్మ(జమదగ్ని) శాంతి కళ్యాణం, నెదురు బోనాలు, పండిత సన్మానం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అలాగే జూన్ 10వ తేదీ మంగళవారం అమ్మవార్లకు బోనాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.